సిలువ వాస్తవాలు - సహో. షఫీకి సవాళ్ళు   

యూనివర్సల్ ఇస్లామిక్ రీసర్చ్ సెంటర్ అనే సంస్థ యొక్క సంస్థాపకుడు సహో. షఫీ ఈ మధ్య కాలంలో తెలుగులో "దావా" కార్యక్రమాలు చేస్తూ క్రైస్తవ మరియు క్రైస్తవేతర ప్రజలకు క్రైస్తవ్యం గురించి మరియు క్రైస్తవ్యం యొక్క మూల బోధనల గురించి, మరి ముఖ్యంగా సిలువ బోధను గురించి వింతైన ధోరణిలో ప్రసంగాలు చేస్తున్నట్టు మనం యూట్యూబ్‍లో చూడగలం. ఇతర దావా ప్రచారకులలాగానే ఈయనగారు కూడా కోటేసుకొని టోపీ పెట్టుకొని చేతులు బోజ్జపైన పెట్టుకొని ఎంతో సాధుమనస్కుడిలా మాట్లాడుతూనే బైబిల్ గ్రంథం గురించి, క్రీస్తును గురించి నోటికి వచ్చినట్టు రెచ్చగోట్టే ధోరణిలో మాట్లాడటం గమనించదగినది. ఇస్లాంమత బోధకులు ఇలా నటించటం బాగానే ఒంటబట్టించుకున్నారు. కానీ వారికి తెలియనిది ఏమిటంటే "చెప్పేవాడికి వినేవాడు లోకువ" అనే భావన ఈ కాలంలో పనికిరాదు. మీరు నోటికోచ్చినదల్లా మాట్లాడి, మీ ఇష్టం వచ్చినప్పుడు బైబిల్‍ను వాడి, ఇష్టం లేనప్పుడు దాని లేఖనాలు పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడినవి కావు అని చెప్పి, అదే బైబిల్ గ్రంథంలోనుండి మీకు కావలసిన విషయాలను ఋజువు చేసుకోవాలని ప్రయత్నిస్తే, మీరు చెప్పినదానికల్లా అమాయక బసవన్నల్లా తలాడించటానికి క్రైస్తవులేమీ గంగిరెద్దులు కారు. సహో. షఫీ తన ఉపన్యాసాలలో చెప్పే ప్రతిమాటా తనకే అనుకూలించేలా మలచుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ నిజం అనేది ప్రజలకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. 

ఈ వ్యాసంలో సహో. షఫీ యొక్క ఉపన్యాసం మరియు అనంతరం నిర్వహించబడిన  ప్రశ్న-జవాబుల సమయంలో జరిగిన తార్కిక లోపాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. ఆయన కొత్తగా ప్రవేశపెట్టిన పాత సిద్ధాంతాలను మీ ముందు తప్పు అని నిర్ధారించే ప్రయత్నం చేస్తాను. సహో. షఫీ ''సిలువను గూర్చిన వాస్తవాలు'' అనే ఉపన్యాసము మరియు దాని పర్యంతం జరిగిన ప్రశ్న-జవాబుల సమయంలో చాలా విషయాలు తప్పుడుగాను, ఉత్తినే తేలిపోయే ఉత్తుత్తి తర్కముతోనూ చెప్పారు. అలా చెప్పిన విషయాలలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ప్రస్తావించడం జరుగుచున్నది. 

సహో. షఫీ ఉపన్యాసంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి - 

  • త్రిత్వం (త్రిఏక దేవుడు) అనే ప్రాథమిక భావనను క్రైస్తవులందరూ అంగీకరించరు, కనుక ఈ సిద్ధాంతం పై క్రైస్తవ్యం ఆధారపడి లేదు. యేసు దేవుడు కాదు అని నమ్మే క్రైస్తవులు కోట్లాది మంది ఉన్నారు!
  • పూర్తి క్రైస్తవ్యం యేసు సిలువ వేయబడ్డాడు అనే ఏకైక సిద్ధాంతం పై నిలిచి ఉంది. 
  •  సిలువపై చనిపోయింది క్రీస్తేనా అన్న విషయంపై క్రైస్తవ్యం రెండు భాగాలుగా విడిపోయి ఉంది. సిలువపై చనిపోయింది క్రీస్తా లేక యెహోవానా అన్న విషయంపై క్రైస్తవ్యం రెండు భాగాలుగా చీలి ఉంది. 
  • ఖురాన్ ప్రకారం యేసును  సిలువ వేయలేదు/సిలువపైకి ఎక్కించలేదు. సిలువపై యేసు చనిపోలేదు/చంపబడలేదు. అల్లాహ్ యేసును సజీవంగా లేపుకున్నాడు. యేసు సిలువ వేయబడలేదు అనేది ఖురాన్ మరియు బైబిల్ యొక్క ఏకాభిప్రాయము! క్రైస్తవులు భ్రమపడుతున్నారు (మార్కు 12 : 24)
  •  మనుష్య పాపాలకొరకు చనిపోయిన వారిలో యేసు ఒక్కడేకాడు, ఇంకా చాలా సంస్కృతులలో ఇలాంటి వారిని చూడవచ్చు.

పై వ్యాఖ్యలను  విశ్లేషిస్తూ అవి యేవిధంగా తర్కలోపమైనవో చూపించే ప్రయత్నం ఈ సంచికలో చేయడం జరుగుతుంది.

 

మొట్ట మొదట క్రైస్తవుల సిద్దాంతాలన్నింటికీ మూల సిద్ధాంతమైన త్రిత్వమును గురించిన వివరణ చూద్దాం.

త్రిత్వం అనే సిద్ధాంతం యొక్క సారం ఏమిటంటే - బైబిలు ప్రకటించే దేవుడు ఒక్కడే, అయితే ఆయన ముగ్గురు వ్యక్తులలో మమేకమై ఉన్నాడు.

ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో దేవుడు ''ఒక్కడే'' అని బోధిస్తారు. ఇస్లాం మూలసిద్ధాంతం అయిన ''షహాద''లో, "లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలల్లాహ్" అని ఉందని ముస్లింలు చెప్తూ ఉంటారు. ''లా ఇలాహ ఇల్లల్లాహ్'' అంటే - ''అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు'' అని అర్థం. (ఇది కేవలం సున్నీ ముస్లింల షహాద మాత్రమే, షియా ముస్లింల షహాదలో ''వ అలియ్యున్ వలియ్యులిల్లాహ్'' అనే మాటలు కూడా కలుపబడి ఉన్నాయి. మాకు ఒకటే ''షహాద'' అని ముస్లింలు గొప్పలు చెప్పుకోవటం కేవలం పచ్చి అబద్ధం, అమాయకులను మోసగించే మరో కుతంత్రం). బైబిల్ గ్రంథంలో కూడా "నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు" (నిర్గమ కాండం 20:3)  అని యెహోవా దేవుడు సూచించిన విషయం తెలిసేందే. మరి ఒకే దేవుడిని ఆరాధించవలెను అని చెప్పే క్రైస్తవులు మరియు ముస్లింలు నిజానికి ఆరాధించే దైవం ఒకటేనా కాదా అనేది అసలు ప్రశ్న. ముమ్మాటికీ కాదు అని క్రైస్తవ అభిప్రాయం. ఎందుకంటే బైబిల్ ప్రకటించే దేవుడు ''త్రిఏక దేవుడు'' కాగా ఇస్లాం ప్రకటించే అల్లాహ్ కేవలం ''ఒంటరివాడు''.

ఒంటరి దేవుడా?  
అల్లాహ్ తన లక్షణములను వ్యక్తపరచుటకు ఒకరపై ఆధారపడే అవసరం కలిగి ఉన్నాడు, కానీ క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం మన దేవుడు ఎవరిపైనా ఆధారపడిలేడు. అల్లాహ్ ఒకే ఒక దేవుడు అనగా ఒంటరి దేవుడు, మరియు సనాతన కాలం నుండి ఒంటరిగా ఉన్నందున తన లక్షణములైన, కనికరం, ప్రేమ, మంచితనం, ఆనందం వంటి మూలతత్వములను వ్యక్తపరచటానికి అల్లాహ్ సృష్టిపై ఆధారపడవలసి ఉంటుంది. అనగా, ''సృష్టి'' లేకపోతే అల్లాహ్ తన ప్రేమను, కనికరమును, మంచితనమును ఎవరితో పంచుకోగలడు? ఈ ప్రశ్నకు ఏ ముస్లిము కూడా ఎన్నటికీ  సమాధానము చెప్పనే చెప్పలేడు. యెహోవా దేవుడు అలాకాక, ''త్రిఏక దేవుడు'' కనుక పైన మనం చెప్పుకొన్న తన మూలలక్షణములను తనలో తానే సనాతన కాలము నుండి అనంతకాలం వరకు వ్యక్తపరచుకోగలడు. ఆయనకు సృష్టిపై ఆధారపడావలసిన అవసరం లేదు. సహీహ్ అల్-బుఖారీ వాల్యూం 8 పుస్తకం 76 సంఖ్య 476 ప్రకారం అల్లాహ్ కనికరమును సృష్టించి 99 భాగములు తన వద్ద ఉంచుకొని ఒక భాగం మిగిలిన సృష్టిలో పంచెను. అనగా అల్లాహ్ ఎల్లప్పుడూ కనికరముతో ఉన్నవాడు కాదు, ఆయన కనికరమును ఒకానొక దినమున సృష్టించుకొన్నాడు. అంటే కనికరములేని అల్లాహ్ కూడా ఉండెను అని అర్థం. అంటే కనికరాన్ని చూపించటానికి ఆయనకు సృష్టిపై ఆధారపడే అవసరం ఉంది అని ఋజువుతో సహా తెలిసిపోయింది. కానీ బైబిల్ ప్రకారం యెహోవా దేవుడు (కీర్తనలు 90:2, 103:17,18) ఆది నుంచి అంతం వరకు సర్వయుగాలలో కరుణగలవాడుగా ప్రకటింపబడ్డాడు.

క్రైస్తవులు నమ్మే దేవుడు ఒక్క దేవుడే కానీ ఒంటరి దేవుడు కాదు. క్రైస్తవులు నమ్మే దేవుడు ముగ్గురు వేర్వేరు మరియు విభజింప శక్యముకాని వ్యక్తుల కలయికగా ఉన్నవాడు. ఒకే దేవునిలో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అను ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు మనం గమనించాలి. ఈ ముగ్గురు వేర్వేరు వ్యక్తులు కనుక వారి మధ్యలో సంభాషణ, ప్రేమపూర్వకమైన సహవాసము కలిగి ఉన్నట్లు బైబిల్ మనకు బోధిస్తోంది. ఇందుకారణంగానే యేసు ప్రభువు ప్రార్థించినపుడు ఆయన సంపూర్ణముగా దేవుడు మరియు సంపూర్ణముగా మనుష్యుడు అయిన కారణంచేత త్రిత్వంలోని తండ్రి మరియు పరిశుద్దాత్ములతో సంభాషించగలిగారని గ్రహించాలి. అలాగే కుమారుడు తనంతట తానుగా మనుష్య రూపం దాల్చి మనుష్యుడు చేయవలసిన ప్రతి మంచి పనిని చేసెను. మనుష్యులకు మాదిరికరమైన జీవితం జీవించడంలో భాగంగానే ఆయన ప్రార్థన కూడా చేశాడు. అలాగే ఆయన సిలువ పై మరణిస్తూ "నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి?" అని అన్నపుడు (మత్తయి 27:46) ఆ ఆర్తనాదం పాపము ఎరుగని యేసు మనుష్యుల కొరకై పాపముగా మారిన కారణంగా తండ్రి విధించే శిక్షను తనపై తీసుకొని ఉదయ సాయంకాల హోమబలి రూపంలో అర్పించబడ్డాడు కనుక అలా పలికాడు. ప్రతి ఉదయము మరియు సాయంత్రము హోమబలి అర్పించవలేనని దేవుడు యూదులకు ఆజ్ఞాపించాడు కనుక యేసు అందరికొరకు ఒకేసారి బలిగా మారి తన పరిశుద్ధతచేత అందరికి పాపవిముక్తి, క్షమాపణ తెచ్చిపెట్టాడు.

యోహాను సువార్త 1:1 -2,14,18 వచనములను గమనించి చూద్దాం.

''ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను (కై హో లోగోస్ ఈన్ ప్రోస్ తోన్ థెఒన్), వాక్యము దేవుడై ఉండెను (కై థెఒస్ ఈన్ హో లోగోస్ ). ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను (హూతోస్ ఈన్ ఎన్ అర్ఖే ప్రోస్ తోన్ థెఒన్)..., 14 - ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 18 - ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రోమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.''

యోహాను ఈ వచనములో, వాక్యము దేవునితో ఉండెను మరియు దేవుడై ఉండెను అని స్పష్టీకరించడం మనం గమనించవచ్చు. "తోన్ థెఒన్" అన్న గ్రీకు పదములో - ''దేవుడు'' అనే ఒక నిర్దిష్టమైన వ్యక్తితో వాక్యము అనంతకాలము నుండి సహభాగత్వంలో మరియు సాంగత్యంలో ఉన్నట్లు వివరించడం జరిగింది. ఇక్కడ ప్రస్తావించబడిన ''దేవుడు'' అనే మాటకు ''తండ్రియైన దేవుడు'' అని పాఠాంతరం. అంతేకాకుండా ''కై థెఒస్ ఈన్ హో లోగోస్ అనే వాక్యంలో - మరియు వాక్యము (లోగోస్) దేవుడై ( థెఒస్) ఉండెను (ఈన్) అని సుస్పష్టముగా వివరించటం జరిగింది. ఇది క్రైస్తవ విశ్వాసము యొక్క మూలం. దీని ఆధారంగానే పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన త్రిఏక సిద్ధాంతం నూతన నిబంధనలో మరింత స్పష్టముగా వెలుగులోకి వచ్చి, మనము దానిని సరిగ్గా అర్థం చేసుకొనే అవకాశం దొరికింది. దేవుడు ఒక్కడే లేక అద్వితీయుడు అని బైబిల్ ప్రతిపాదించిన ''షెమ'' సిద్ధాంతమును ద్వితీయోపదేశకాండం 6:4 లో మనం చూస్తాం. ''ఇస్రాయేలూ వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా (యెహ్‍వాహ్ ఎఖాద్). ''ఎఖాద్'' అన్న హెబ్రీభాష పదమునకు సంయోగముగల / ఐక్యతగల ఏకత్వం అని అర్థం. అనగా, ''తండ్రి కుమార పరిశుద్ధాత్ముల ఐక్యతగల ఏక దేవుడు'' అని అర్థం. ఇదే క్రైస్తవ విశ్వాసం. త్రిత్వమును ఇంకా లోతుగా తెలుసుకోవాలి అనుకొన్న వారి కొరకై ఎన్నో వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించబడ్డాయి, వాటిలో - రెవరెండ్ సుధాకర్ మొండితోక గారు రచించిన ''ఫోకసింగ్ ఆన్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద హోలీ ట్రినిటి'', మరియు డాక్టర్ నార్మన్ గీస్లెర్‍గారు రచించిన ''ద ట్రినిటి'' అనేవి సహాయకరమైనవి.

 

త్రిత్వం (త్రిఏక దేవుడు) అనే ప్రాథమిక భావనను క్రైస్తవులందరూ అంగీకరించరు, కనుక ఈ సిద్ధాంతం పై క్రైస్తవ్యం ఆధారపడి లేదు. 

యేసు దేవుడు కాదు అని నమ్మే క్రైస్తవులు కోట్లాది మంది ఉన్నారు! 

ఇకపోతే చాలా మంది క్రైస్తవులు ఈ సిద్ధాంతాన్ని నమ్మరు కనుక ఈ సిద్ధాంతముపై క్రైస్తవ్యం ఆధారపడిలేదు అనేది సహో. షఫీ యొక్క వాదన. సహో. షఫీ చూసే లెక్క ఎంత తప్పంటే, ప్రపంచంలో ఎక్కువమంది దేనిని నమ్మితే అదే ప్రాముఖ్యమైనది మిగిలినవి ప్రాముఖ్యమైనవి కావు అనేదే ఆయన వాదనలాగ కనిపిస్తుంది. ఒకవేళ సహో. షఫీ యొక్క తర్కంతోనే ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కువమంది నమ్మేది ఇస్లాంని కాదుగాని క్రైస్తవ్యాన్నే! అలాంటప్పుడు ఆయన చెప్పే ఇస్లాంమత ఉపన్యాసాలు వినే అవసరం కూడా ఎవ్వరికి ఉండకూడదు. ఎందుకంటే ఆయన బోధించే ఇస్లాం మతం, ఆయన తర్కం ప్రకారం ప్రాముఖ్యమైనది కాకుండాపోయింది కదా! అయ్యా, క్రైస్తవ్యంలో విశ్వాస శాఖలు ఎన్ని ఉన్నా వాటన్నింటిలోను అందరూ నమ్మాల్సిన అతి ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి, వాటిని మాత్రం అందరూ నమ్మి తీరాలి అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. అలా ప్రాముఖ్యమైన సిద్ధాంతాలను నమ్మకపోతే వారిని క్రైస్తవులుగానే పరిగణించరు. అలాంటి ఒక ఉదాహరణే - యెహోవా సాక్షులు. ఇలాంటి తప్పుడు తెగలు ఎన్నోఉన్నా వారిని క్రైస్తవులుగా పరిగణించరు. వారు తమకి సంబంధించిన స్వేచ్చామతాన్ని పాటించేవారు మాత్రమే. సాంప్రదాయబద్ధమైన క్రైస్తవ్యంలో ''త్రిత్వం'' అనే సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైనది. త్రిత్వం అనే సిద్ధాంతాన్ని క్రైస్తవ్యం నుండి తొలగిస్తే క్రీస్తు మరణం సర్వపాప పరిహారం కొరకు పనిచేయదు అన్న విషయం క్రైస్తవులకు బాగా తెలుసు. యే సిద్ధాంతంపైన క్రైస్తవ్యం ఆధారపడి ఉంది, దేనిపైన ఆధారపడి లేదు అని సహో. షఫీ చెప్పినా అది కేవలం ఆయన ఉద్దేశ్యం మాత్రమే కాని సాంప్రదాయ క్రైస్తవ్యం యొక్క ఉద్దేశ్యం కాదు. క్రైస్తవులకు యే సిద్ధాంతం ప్రాముఖ్యమైనదో తెలుసుకోవాలంటే వారినే అడిగి నేర్చుకోవటం ఉత్తమం కాదా? 


పూర్తి క్రైస్తవ్యం యేసు సిలువ వేయబడ్డాడు అనే ఏకైక సిద్ధాంతం పై నిలిచి ఉంది. 

క్రీస్తు సిలువపైన క్రైస్తవ్యం ఆధారపడి ఉంది అన్న మాటలో చాలా వరకు సత్యం ఉన్నప్పటికి దానిపై మాత్రమే ఆధారపడి ఉంది అనేది పెద్ద అసత్యం. ఇక్కడొక ఉదాహరణగా ఆయన కన్యకకు జన్మించడాన్ని చూద్దాం. ఆయన కన్యకకు జన్మించకుండా ఉంటే ఆయన జన్మము నుండే పరిశుద్ధుడు అని చెప్పటానికి వీలు అయ్యేది కాదు. ఫలితంగా, ఆయన సిలువ మరణం ఎవరికీ ప్రయోజనకరం కాకుండా పోతుంది. కనుక బైబిల్ మరియు దాని సిద్ధాంతాలను సంపూర్ణమైన దృక్పథంతో చూడాలే కానీ, మూల సిద్ధాంతాలలో కొన్నిమాత్రమే ప్రాముఖ్యం అని చెప్పడం భావ్యం కాదు; అది కేవలం అవగాహన లోపమో లేక మూర్ఖత్వమో అవుతుంది.

సిలువపై చనిపోయింది క్రీస్తేనా అన్న విషయంపై క్రైస్తవ్యం రెండు భాగాలుగా విడిపోయి ఉంది. యేసు సిలువ వేయబడలేదు అనేది ఖురాన్ మరియు బైబిల్ యొక్క ఏకాభిప్రాయము! క్రైస్తవులు భ్రమపడుతున్నారు (మార్కు 12 : 24) 

యేసు సిలువపై చనిపోయాడు అని క్రైస్తవులు నమ్ముచున్నప్పటికి, సిలువపై చనిపోయినది ఎవరు అన్న విషయమై వారు మళ్ళీ రెండు భాగాలుగా విడిపోయారు అని సహో. షఫీ వాదిస్తున్నారు. ఆయన ప్రకారం కొంతమంది యెహోవాయే సిలువపై మరణించాడు అని అంటున్నారంట, ఇంకొంతమంది యెహోవా తన ప్రియ కుమారుడైన యేసును మరణించమని 
పంపించాడు అని అంటున్నారు. ఈ విధంగా కైస్తవులు క్రీస్తు మరణం విషయమై భ్రమపడుతున్నారు అని సహో. షఫీ అంటున్నారు. దాన్ని ధృవీకరించుటకు ఆయన గలతీ 3:1ని వల్లిస్తున్నట్టు చూడవచ్చు. అంతేకాక బైబిల్ మరియు ఖురాన్ రెండూ కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నట్టుగా ఆయన వాదించటం హాస్యాస్పదం. ఆయన ప్రకారం బైబిల్ కూడా యేసు సిలువపై మరణించలేదు అని చెబుతోందట. 
ఆయన వాదన ఈ క్రింది విధంగా ఉంది:
1 . మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆయన చనిపోడు ( యోహాను 12:34 )
2 . ప్రవక్తల గ్రంథం ప్రకారం ఆయన చనిపొడు ( సామెతలు 12:13, యెషయా 51:14, కీర్తనలు 34:17, హెబ్రీ 5 :7 )    
3 . కీర్తనల గ్రంథంలో కూడా ఆయన చనిపోడు అని వ్రాయబడిఉంది ( కీర్తనలు 34:17,19 )  
4 . యేసే స్వయంగా నేను చనిపోలేదు అని చెప్పాడు ( యోనా సూచక క్రియ)

ఆయన వాదనను కొంచెం జాగ్రత్తగా చూద్దాం:-
క్రైస్తవులు తమ లేఖనములను గాని దేవుని శక్తిని గాని సంపూర్ణముగా ఎరుగకయే పొరపడుతున్నారు అని ఆయన ఉద్దేశ్యం. ఆయన చెప్పేదేమంటే, ధర్మశాస్త్రము, ప్రవక్తల పుస్తకములు, కీర్తనలు మరియు స్వయంగా క్రీస్తు పలికిన మాటల ప్రకారముగా యేసుక్రీస్తు సిలువపై చనిపోలేదు. యోహాను 12:34లో యూదులు క్రీస్తు నిరంతరం ఉండేవాడు అని అర్థం చేసుకున్నట్టు చెప్పడం నిజమే. కాకపోతే ముస్లిములు మనకు ఇచ్చే గొప్ప శిక్షణ ఏంటంటే లేఖనములను వాటి సందర్భములో మనం ఎప్పుడూ చదువరాదు అని. ఆ శిక్షణను మనము అనుసరించవలసిన అవసరం లేదు. క్రైస్తవులు తమ గ్రంథాన్ని సందర్భమునకు అనుసారముగానే చదువుతారు. యోహాను 12:34 యొక్క సందర్భం ఏమిటంటే యేసు తన మరణపునరుత్థానములను అక్కడి ప్రజలకు/శిష్యులకు వివరిస్తున్నాడు. 34వ వచనం చదవటానికి ముందు 33వ వచనం చదివితే అది తేటతెల్లం అవుతుంది. "తాను యే విధంగా మరణము పొందవలసియుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను" (యోహాను 12:34). అంటే ఇక్కడ యేసు చనిపోడు అని చెప్పటంలేదు కానీ తాను యేవిధంగా చనిపోతాడో యేసుప్రభువే చెప్పడం జరిగింది. 34వ వచనంలో అక్కడి యూదులు తాము విన్న ధర్మశాస్త్ర భాగములలో క్రీస్తు అనంతంగా వారిపై రాజ్యం చేస్తాడు అన్న విషయాన్ని గుర్తుచేస్తూ ఆయన ఎందుకు కొనిపోబడతాడు అని ప్రశ్నిస్తున్నట్టు మనం చూడవచ్చు. యోహాను సువార్త 19:7లో ఇదే యూదులు పిలాతు ఎదుట "మాకొక నియమము (శాస్త్రము) కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలేనని అతనితో ( పిలాతు) చెప్పిరి". సహో. షఫీ ఏ లేఖనములను ఆధారము చేసుకొని యేసు చనిపోలేదు అని చెప్పాలనుకుంటున్నారో ఆ లేఖనములలో యేసు తన మరణమును గురించి తనే చెపుతున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే యే యూదులైతే ఆయన నిరంతరం ఉండును కదా! అని ధర్మశాస్త్రం ఆధారంగా అడుగుతున్నారో అదే ధర్మశాస్త్రం ఆధారంగా అదే యూదులు ఆయనను "దేవుని కుమారుడనని ఇతను చెప్పుకొనెను" అన్న నెపంతో చంపమని పిలాతుకు విన్నవించుకుంటున్నట్టుగా చూస్తున్నాం. కనుక సహో. షఫీ ఇక్కడ ఒక బైబిల్ విషయమును నేర్చుకొని తమ అజ్ఞానాన్ని పటాపంచలు చేసికొనాలి. అదేదనగా, యూదులు ధర్మశాస్త్రమందు చెప్పబడిన క్రీస్తును మరియు ఆయన రాజ్యమును దైవికమైన విశ్వాసవాదముతో కాక లౌకికవాదముతోనే ఆశించారు. కాని యేసు, దేవుని రాజ్యము నిరంతరం ఉండే రాజ్యమని; మృతులకు సహితం తాను సువార్తనందించి తన రాజ్యమును సదాకాలము వరకు నిలిచి ఉండేదిగా చేస్తానని మరియు మృత్యుంజయుడై తిరిగి తన సంఘమును కొనిపోవటానికి మరియు అంత్యదినమున తీర్పు తీర్చుటకు వస్తానని లేఖనములలో స్పష్టంగా చెప్పాడు.  

ఇక ప్రవక్తల గ్రంథమును చూస్తే - యెహోవా నీతిమంతులను రక్షించును అని సామెతలలోను మరియు క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును, అతను గోతిలోనికి పొడు, అతనికి ఆహారము తప్పదు అని యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటలను సహో. షఫీ చక్కగా తనకు అనుకూలించేట్టు వివరించడం అంత ఆశ్చర్యకరమేమీ కాదు. ఎందుకంటే, దావా ప్రచారకులు సాధారణంగా అవలంభించే నేతిబీరకాయి పద్ధతే ఇది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే పైన చెప్పిన రెండు వచనములు కూడా ఎందరికో వర్తించే సాధారణమైన మాటలేగాని ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి చెప్పబడిన మాటలుకావు. నీతిమంతులు అన్న మాటలో ''బహువచనం'' ఉంది. అంటే, అది సాధారణంగా నీతిని అనుసరించే అందరి గురించి చెప్పబడిన విషయం. మరి యోషయలో క్రుంగబడినవాడు అన్న పదం కూడా ఇదే కోవకు చెందినది అని ఆ వాక్యభాగమును సందర్భోచితముగా చదివితే తెలిసిపోతుంది. అలాగే హెబ్రీ 5:7లో "శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీరకరింపబడెను" అని ఉన్న విషయాన్ని సహో. షఫీ తనకు అనుకూలించేటట్టు వాడుకుంటూ ఈ వాక్యము యొక్క సందర్భమును మాత్రం తుంగలో తొక్కారు. ఒక్కసారి పై వాక్యభాగము యొక్క సందర్భం ఏమిటి అని చూస్తే మనకు తెలిసేది ఏమిటంటే హెబ్రీ పత్రిక యొక్క రచయిత ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకులు మనుష్యులలోనుండి యే విధముగా ఎర్పరచబడతారు, వారు దేవుని నిమిత్తమైన కార్యములు జరిగించుటకై యే విధంగా మనుష్యుల నిమిత్తం నియమింపబడతారు అన్న విషయాన్ని అక్కడ వివరించడం గమనించాలి. నిజానికి సహో. షఫీ ఈ వాక్య భాగాన్ని ఎంతమాత్రం తనకు అనుకూలంగా వాడుకోలేరు. ఎందుకంటే, అదే పుస్తకం అదే అధ్యాయం 5:5లో "నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమ పరచెను" అని వ్రాయబడి ఉంది కదా! నిజంగా సహో. షఫీ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయమును వాడుకోవాలి అంటే, లేక అందులో వ్రాసినది నిజం అని నమ్మితే దేవుడే యేసును నీవు నా కుమారుడవు అన్న మాటను కూడా వాడవలసి వస్తుంది లేక నమ్మవలసి వస్తుంది. ఒకవేళ సహో. షఫీ గనుక ఆ రకంగా నేను నమ్మను కాని క్రైస్తవులు నమ్ముతారు కనుక వారి పుస్తకంలో ఉన్న మాటల ద్వారా నేను నా విషయమును వారికి అర్థం అయ్యేలా చెపుతున్నాను అని అంటే, అది కూడా అతనికి పెద్ద చిక్కే. ఎందుకంటే క్రైస్తవులు 5:5ను కూడా నమ్ముతారు మరియు ఇదే హెబ్రీ 5:8లో వ్రాయబడిన "ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకోనేను" అన్న వచనమును కూడా నమ్ముతారు. క్రైస్తవులు ఒక వచనమును దాని సందర్భము మరియు క్రైస్తవ మూల సిద్ధాంతముల పరిధిలో చదివి సరైన రీతిలో అర్థము చేసుకుంటారు. అంతే కానీ సహో. షఫీలాగ ప్రతి వచనమును తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఎన్నడూ చదవరు.

ప్రవక్తల గ్రంథమునుండి చదవాలి అని గనుక సహో. షఫీకి ఉబలాటంగా ఉంటే ఆయనగారు ప్రస్తావించిన యెషయా 51కి రెండు అధ్యాయాలు దాటి 53వ అధ్యాయం చదివితే అసలు ప్రవక్తలు యేసును గురించి లేక క్రీస్తును గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారో తెలుస్తుంది. సహో. షఫీ యొక్క శ్రోతలలో ఒకరు ఈ విషయాన్ని ఒక ప్రశ్నగా కూడా అడిగారు. కాకపోతే ఆయనగారు ఆ ప్రశ్నను సారములేని బుకాయింపు మాటలతో ఫిరాయించారు. యోషయ 53:9లో "అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను" అని వ్రాయబడి ఉంది. అంటే, ప్రవక్తల ప్రకారం కూడా ఆయన చనిపోతాడని అది నిర్దారించడం కాదా?          

ఇక కీర్తనల గ్రంథములోని 34:17 మరియు 19ని పరిశీలిద్దాం. ఇక్కడ నీతిమంతుల మొర యెహోవా ఆలకించి వారిని శ్రమల నుండి రక్షిస్తాడు అని చెప్పబడి ఉంది. అయితే సహో. షఫీ వాదన ఏమిటంటే యేసుక్రీస్తు నీతిమంతుడు కనుక ఆయన మొర దేవుడు ఆలకించి సిలువ మరణము నుండి ఆయనను రక్షించెను అని. ఆయన వాదనలో నిజం కేవలం యేసు నీతిమంతుడు అన్నంత వరకే. ఎందుకంటే యేసు ఇలలోకి వచ్చిందే తన ప్రాణమును బలిగా అర్పించటానికి. అందువల్లే ఆయన - దేవా ఈ గిన్నె నా నుండి తప్పించు అని ప్రార్థిస్తూనే - కానీ నీ చిత్తమే జరుగటం నాకు ఇష్టం అని ప్రార్థించాడు. అందువల్లే ఆయన తన తండ్రి చిత్తానుసారముగా స్వచ్ఛందముగా తన ప్రాణమును సిలువపై అర్పించాడు. పాపుల పాపము వలన వచ్చు మరణం అనే జీతం నుండి పాపులను రక్షించటానికి దేవుడు తప్ప ఇంకెవరు ఆయన నియమించిన పాపరహిత బలిని అర్పించగలరు? అందువలననే కుమారుడైన దేవుడు స్వచ్ఛందముగా తండ్రి నియమమును పాటించి మనుష్యజాతికి మేలు కలుగుటకై తన ప్రాణమును అర్పించాడు. కొలొస్సీ 2:9 ప్రకారము యేసు దేవుని సంపూర్ణ స్వరూపమును కలిగినవాడు. యోహాను 1:1,14 ప్రకారము దేవుడైన వాక్యము యేసు రూపములో శరేరధారియై తనపై నమ్మిక యుంచినవారికి దేవుని పిల్లలయ్యే అధికారమును ఇచ్చెను. భూమి పునాదులు వేయబడక ముందే దేవుడు యేసులో మనలను ఎన్నుకొనెను అని ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ఉంది. అనగా దేవుని ఎన్నిక భూమి పునాదులు వేయబడక మునుపే ఉంది. అనగా యేసు భూమి పునాదులు వేయబడక ముందే మనలను రక్షించుకోవడానికి తను చేసే బలిని స్వచ్ఛందంగా తండ్రి చిత్తములో చేయడానికి ఇష్టపడినాడు. అలాంటప్పుడు దేవుడు ఆయనను ఎందుకు రక్షించాలి?  మానవులమైన మనకు రక్షణ అవసరము కాని దేవుడైన యేసుకు రక్షణ అవసరము లేదు.  ఆయన తనను తాను సిలువ మరణము నుండి మరియు బాధలనుండి రక్షించుకోగల సమర్థుడు అన్న విషయం మరిచిపోరాదు.

యేసు తనంతట తాను పలికిన మాటలను పరిశీలించి సహో. షఫీ ఇచ్చిన వివరణ ఎంతమాత్రం సరైనదో చూద్దాం-

యేసు తన మరణ పునరుత్తానములను గురించి పలికిన ఎన్నో మాటలను సహో. షఫీ విస్మరించి తనకు అనుకూలమైన కొన్ని మాటలను పరిగణించి ముఖ్యంగా యోనా సూచక క్రియపై ఎక్కువ భాగం ఉపన్యాసాన్ని నిలపటం గమనించవచ్చు. ఇస్లామిక్ దావా పెద్దమనుషులందరూ చేసిన ప్రయత్నమే సహో. షఫీ మళ్ళీ చేస్తున్నారు, అంతే. తన గురువులవంటి వారైన షేక్ అహ్మద్ దీదాత్, యూసుఫ్ ఎస్తేస్, జాకిర్ నాయక్ మొదలగు దావా ప్రచారకులు ఈ ప్రశ్న వేసి వేసి సమాధానం మాటి మాటికి విని అలిసిపోయారు. వీరికి సరిగ్గా సమాధానం చెప్పిన జాన్  గిల్‍క్రిస్ట్, జోష్ మెక్‍డోవేల్ వంటి క్రైస్తవ ప్రచారకులు ఇంకా ఆ సమాధానాన్ని ముస్లిములకు అందచేస్తూనే ఉన్నారు. నా మిత్రుడు శాం షమూన్ కూడా చాలా సార్లు తన డిబేట్‍లలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

యోనాను గురించి యేసుప్రభువు పలికిన మాటలను చూద్దాం -

"ప్రవక్తయైన యోనాను గూర్చిన సుచకక్రియయే గాని మరి ఏ సూచకక్రియైన వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు దివారాత్రులు తిమింగలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును." (మత్తయి 12:40)  

ఈ వాక్యాన్ని పట్టుకుని సహో. షఫీ, మరియు ఆయన గురువులవంటి వారైన ఇతర దావాప్రచారకులు చెప్పే విషయం ఏమిటంటే -
1 . యోనా తిమింగలం కడుపులో బ్రతికే ఉన్నాడు కనుక యేసు కూడా భూగర్భంలో బ్రతికే ఉంటాడు. యోనాలా బ్రతికి ఉంటే సూచక క్రియ అనవచ్చుగాని, చనిపోతే సూచక క్రియ ఎలా అవుతుంది?
2 .యేసు మూడు రాత్రులు మూడు పగళ్ళు అసలు సమాధిలో లేనేలేడు  కదా?  
3. బైబిల్ నిజమైతే యేసు తప్పు (ఆయన మూడు రాత్రులు మూడు పగళ్ళు భూగర్భంలో లేడు కనుక) ఒకవేళ యేసు నిజమైతే బైబిల్ తప్పు (ఎందుకంటే బైబిల్‍లో తప్పుగా వ్రాయబడి ఉంది కనుక). 

పై క్రమములోనే మనమిప్పుడు సమాధానములు చూద్దాం -

1. యోనా తిమింగలం కడుపులో బ్రతికే ఉన్నాడు అన్న విషయంలో క్రైస్తవులకు అణువంత కూడా అనుమానం లేదు, ఎందుకంటే అది బైబిల్‍లో వ్రాయబడి ఉంది కనుక. కానీ ఇక్కడ యేసు చెప్పిన మాటలను సరిగ్గా గమనించి చూస్తే ఆయన బ్రతికి ఉంటాడా లేక చనిపోయి ఉంటాడా అనే మాటపై ఒత్తిడి లేదుగాని మూడు దివారాత్రులు అనే మాట పై ఒత్తిడి ఉంది. ఉదాహరణకు - "అరణ్యములో మోషే సర్పమును యేలాగు ఎత్తెనో  ఆలాగే .... మనుష్యకుమారుడు ఎత్తబడవలెను." (యోహాను 3:14-15) అనే ఈ వాక్యంలో - యేసు సర్పమును పోలి ఉనట్లు కాదుగాని అలా ఎత్తబడాలి అని మాత్రమే అర్థం, ఎందుకంటే ఇక్కడ ఎత్తబడటం అనే కార్యంపై ఒత్తిడి ఉంది. ఒకవేళ సహో. షఫీ ఇచ్చే వివరణను మనం ఇక్కడ అన్వయింపజేస్తే మోషే ఎత్తిన సర్పం జీవంలేకుండా నిర్జీవ స్థితిలోనే ఉండేది కదా? అలాగే యేసు కూడా సిలువలో జీవంలేకుండా నిర్జీవ స్థితిలోనే అనగా చచ్చిన స్థితిలోనే వ్రేలాడెనని సహో. షఫీ ఒప్పుకోవడానికి సిద్ధమేనా? అంత దమ్ము ఆయనకున్నదా? ఇక్కడ మనకు సహో. షఫీ తన పప్పులుడకపెట్టుకోలేని దొంగగా దొరికిపోయారు. పాపం ఇప్పుడు తన తలెక్కడ పెట్టుకుంటారో చూద్దాం! కాబట్టి మత్తయి 12:40లో కూడా మూడు దివారాత్రులు అనే దానిపై ఒత్తిడి ఉందిగాని బ్రతికి ఉంటాడా లేక చనిపోయి ఉంటాడా అన్న దాని ప్రస్తావన అసలకే లేదు. కనుక యేసు చెప్పిన సూచక క్రియ మూడు దివారాత్రులు అనే విషయంలోనే ఉంది కాని బ్రతికి ఉండటంలో మరియు చనిపోవటంలో లేదు.

2. సహో. షఫీ చెప్పినట్టు క్రైస్తవ్యం అంతా కూడా యేసు శుక్రవారము సిలువ వేయబడి ఆదివారము మృత్యుంజయుడై లేచాడు అని నమ్ముతారు. ఈ విషయంలో కూడా క్రైస్తవులకు  అణువంత కూడా సందేహం లేదు. సహో. షఫీ తమ గురువైన అహ్మద్ దీదాత్‍లాగానే, క్రైస్తవులంతా అయిన్‍స్టీన్‍లుగా మారినాగాని ఈ వచనంలోని మూడు రాత్రులు మూడు పగళ్ళను లెక్క వేయలేరు అని చెప్పడం గమనార్హం. అలా చెప్పి ఏదో చేసేశాం అని చంకలుబాదుకొన్న వారంతా కూడా అసలు విషయం తెలిశాక నాలుక కరుచుకున్నవారే లెండి! ఇక్కడ సహో. షఫీ - నేను మరచిపోతా మరచిపోతా అంటూ - కావాలనే మరిచిపోయిన విషయం ఏమిటంటే ఈ మాట ఇప్పుడు కరీంనగర్‍లో ఆంగ్ల క్యాలెండర్ చదివే షఫీకి చెప్పబడింది కాదుగాని రెండు వేల సంవత్సరాల క్రితం యూదులకు చెప్పబడినది. సహో. షఫీ తన ఉపన్యాసంలో ముస్లిముల క్యాలెండరు, యూదుల క్యాలెండరు రెండూ చంద్రుడిని ఆధారం చేసికొని తయారు చేయబడినవే అని కూడా చెప్పారు. కాకపోతే ఆ క్యాలెండరులో యే భాగాన్ని ఒక రోజు అంటారు అన్నది ఆయనగారు కావాలనే మరిచారు . ఒక్కసారి ఆనాటి యూదులు ఈ మాటను యే విధంగా అర్థం చేసుకున్నారో చూస్తే మనకు తేలికగా అసలు సంగతి అర్థం అవుతుంది. 
యేసును ఏ యాజక సమూహం సిలువ వేయడానికి నడుము బిగించిందో, ఎవరికైతే యేసు ఈ యోనా సూచక క్రియ గురించి చెప్పాడో, ఆ యూదుల యాజక సమూహం పిలాతు వద్దకు వచ్చి "అయ్యా ఆ వంచకుడు సజీవుడై వుండినప్పుడు - మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది" అని మత్తయి 27:63లో అన్నారు. అంటే, స్వయంగా యేసు ఎవరితోనయితే మాట్లాడాడో వారికి యేసు చెప్పిన "మూడు దివారాత్రులు" అనే మాట "మూడు దినములుగా" అర్థం అయింది. ఇక్కడ సహో. షఫీగాని ఆయన గురువులు కాని ఉపమానసహితమైన మాటలను ఉపమానములుగానే అర్థం చేసుకోవాలి కాని అక్షరార్థంగా అర్థం చేసుకోరాదు అన్న ప్రాథమిక సత్యాన్నే మరిచారు. ఎవరైనా పనిమీద ఊరికి వెళ్తే, ఇంట్లో వారికి - "రెండు మూడు రోజులకు వచ్చేస్తా" అని తెలుగులో ఉపమాన రీతిగా చెబుతారు. అంటే తక్కువ రోజులకే వచ్చేస్తాను లేక ఎక్కువ రోజులు ఉండను అని అర్థం. కానీ ఆ మాటను అక్షరార్థంగా తీసుకొంటే రెండు రోజులనా లేక మూడు రోజులనా లేక వాటి మొత్తం అయిదు రోజులనా??? అది కేవలం ఒక ఉపమానయుక్తమైన భాష. అలాగే యూదులకు మూడు దివారాత్రులు అంటే మూడు రోజులు అని అర్థం. 
ఇకపోతే చంద్రుని అనుసారంగా క్యాలెండర్ పాటించే వారు ఒక దినములోని ఎంత తక్కువ సమయాన్ని అయినా సరే ఒక సంపూర్ణ దినంగా లెక్కిస్తారు. అంటే శుక్రవారం సాయంత్రం అయినా, ఉదయం అయినా మధ్యాన్నం అయినా జరిగిన ఘటనను శుక్రవారంతో లెక్కించడం ఆనవాయితీ. కనుక యేసు శుక్రవారం మధ్యాహ్నం సిలువ వేయబడ్డాడు, ఆదివారం ఉదయం లేచాడు అంటే శుక్ర, శని మరియు ఆదివారాలు కలిసి మూడు దినములు అవుతాయి. ఈ వివరణ సహో. షఫీ చేసే వికృతతత్వ తాండవానికి సరైన విరుగుడుగా భావిస్తున్నాను. 

3. ఇక 3వ అభ్యంతరాన్ని చూస్తే అదేదో క్రైస్తవులను పేద్ధ ఇరకాటంలో పెట్టేదిగా ఉందని భ్రమపడుతూ ఉంటారు ముస్లిములు. అసలుకు, యేసు లేక బైబిల్ రెండింటిలో ఏది తప్పయినా ముస్లిం మతం నమ్మదగినది కాకుండా పోతుంది, ఎందుకంటే ఖురాన్ ప్రకారం అల్లాహ్‍యే బైబిల్‍ను మనుష్యులకు ఇచ్చాడు; యేసును కూడా అల్లా‍హ్‍యే పంపించాడు. ఈ రెండింటిలో ఏది తప్పయినా ఖురాన్ మరియు అల్లా‍హ్ తప్పవుతారు. ఎందుకంటే ఖురాన్ బైబిల్‍ను సత్యముగా పరిగణిస్తుంది కనుక. బైబిలును పవిత్ర గ్రంథంగా పరిగణించని యే ముస్లిమూ ముస్లిం కాడు (సహో. షఫీ ఒప్పుకునే మాటలివి). కానీ ఖురాన్ని పవిత్ర గ్రంథంగా పరిగణించమని బైబిల్ మాత్రం ఉపదేశించదు. కనుక ముస్లిములే ఇక్కడ తమ పుస్తకమును బైబిల్ వెలుగులో చదవాలి కానీ క్రైస్తవులు బైబిల్‍ను ఖురాన్ ప్రకారం చదువవలసిన అవసరం లేదు. ఈ మాటలకు ఆధారంగా ఖురాన్‍లోని కొన్ని ఆయతులను చూద్దాం.

ఖురాన్ 7:156-157 - "దైవ సందేశహరుడు, నిరక్షరాస్యుడు అయిన ఈ (ముహమ్మద్) ప్రవక్తను అనుసరించే వారికి (నేడీ మేలు వ్రాయబడింది). ఇతని ప్రస్తావన వారి దగ్గరున్న తౌరాత్, ఇంజీల్ గ్రంథాలలో కూడా ఉంది". 

ఈ ఆయత్తు ముహమ్మద్‍పై అవతరించిన సమయంలో అప్పటికే ప్రచురణలో ఉన్న బైబిల్‍లో (తౌరాత్, ఇంజీల్) ఆయనగారి గురించిన ప్రస్తావన ఉంది అని ఈ ఆయత్తు చెబుతోంది. అంటే ముహమ్మద్ సమయంలో ఉన్న బైబిల్‍ను చదివి ఆయన (ముహమ్మద్) చెప్పేది సరైనదా  కాదా అని చూడమని అర్థం. అంటే, బైబిల్ ముహమ్మద్ యొక్క మాటలు నిజమా కాదా అని సరిచూసే విధంగా ఎంతో హెచ్చు స్థితిలో ఉన్న శ్రేష్ట గ్రంథం అని అర్థం కాదా?

"ఈ గ్రంథం (ఖురాన్) పూర్వము వచ్చిన గ్రంథాలను (తౌరాత్, ఇంజీల్) ధృవీకరిస్తూ వచ్చింది". (సూరహ్ 35:31)

"ఇది (ఖురాన్) పూర్వం అవతరించిన గ్రంథాలను ధృవీకరిస్తున్న దివ్య గ్రంథం, వాటన్నిటి మౌలిక బోధనలను విపులీకరించే సమగ్ర గ్రంథం....ఇందులో ఎలాంటి సందేహం లేదు". (సూరహ్ 10:37)

ఇక్కడ వాడబడిన ''బైన యదైహి'' అనే అరబ్బీ పదమునకు అర్థం "నీ చేతుల నడుమ ఉన్న'' పూర్వము అవతరించిన గ్రంథములు అని అర్థం. అంటే అప్పుడు ముహమ్మద్‍కు అందుబాటులో ఉన్న బైబిల్ గ్రంథమును ఖురాన్ ధృవీకరించాటానికి వచ్చింది అని అర్థం. అలాంటప్పుడు సహో. షఫీ కాని వారి గురువులుకాని యే ధైర్యంతో బైబిల్‍ను తప్పులు గల గ్రంథంగా ధృవీకరించే ప్రయత్నం చేస్తున్నారో వారికే తెలియాలి.

ఇంతవరకు మనం చర్చించుకున్న విషయాల ఆధారంగా బైబిల్ మరియు ఖురాన్ క్రీస్తు సిలువ వేయబడడం అనే విషయంలో ఏకాభిప్రాయమును ముమ్మాటికీ కలిగి లేవు. 

 

మనుష్య పాపాలకొరకు చనిపోయిన వారిలో యేసు ఒక్కడేకాడు, ఇంకా చాలా సంస్కృతులలో ఇలాంటి వారిని చూడవచ్చు.

ఇకపోతే, ఈ ప్రపంచ సంస్కృతులలో యేసులాగనే మనుష్యుల పాపముల కొరకు చనిపోయినవారిగా భావించబడేవారు చాలామంది ఉన్నారు అని సహో. షఫీ యొక్క వాదన. ఇది ఎంత దుర్మార్గమైన తర్కమండీ!? ఇదే తర్కాన్ని అనుసరించి ఆలోచిస్తే  నేను కూడా దేవుని ప్రవక్తను అని ముహమ్మద్‍లా చెప్పుకొన్నవారు కూడా లక్షలలో ఉన్నారు. కాబట్టి, సహో. షఫీ ముహమ్మద్‍ను ప్రవక్తగా పరిగణించడమే ఇప్పటినుంచి మానుకుంటారా? ఇక్కడ మనకు సహో. షఫీ తన పప్పులుడకపెట్టుకోలేని దొంగగా మరలా దొరికిపోయారు. పాపం ఇప్పుడు తన తలెక్కడ పెట్టుకుంటారో మళ్ళీ చూద్దాం! నేనే దేవుడిని అని చెప్పుకునేవారు కూడా చాలా మంది ఉంటారు. అలా అని నిజమైన దేవుని గూర్తెరుగకుండా ఉంటామా? ఉండము కదా! అలాంటప్పుడు మనం చేయవలసినది ఏమిటంటే, అలా చెప్పుకొనే వారిలో ఎవరు చరిత్రలో నిజమైనవారు? ఎవరి గురించి దేవుడు ముందుగానే ప్రవచించి, మనము గలిబిలికి గురవకుండా ఉండాలని మనకోసరము ముందుగా వ్రాయించి భద్రపరిచాడు? ఎవరి జీవితం తాము చెప్పిన సూక్తులకు లేక చేసిన బోధనలకు సరిపోయేదిగా ఉంది? ఎవరు సూచక క్రియలు చేశారు? ఇలాంటి ఎన్నో కోణాలలో వారిని పరీక్షించి ఆ తరువాతనే నిజమైన వారి యొద్దకు వెళ్ళాలి. ఇలాంటి నిజమైన పరీక్షలో ముహమ్మద్ యొక్క జీవితం అస్సలు నిలువక సులభముగానే తెలిపోయి పొట్టువలె కొట్టుకుపోతుంది. ఎందుకంటే, చివరికి తాను చేసిన బోధనలను కూడా ముహమ్మద్ అనుసరించలేక విఫలమైనాడని మనకు తెలుసు.

ఇక సామాన్య తర్కం ఉపయోగించి సహో. షఫీ మాటలకు సవాళ్లు విసిరే సమయం వచ్చింది. అవేమిటంటే -
·    సిలువలో యేసు చనిపోకపోతే ఇంకెవరు చనిపోయారు?
·    యేసు చనిపోయాడు అనిపించేలా ప్రజలను భ్రమ పెట్టవలసిన అవసరం అల్లా‍హ్‍కు ఏమిటి? ఇది మోసమా లేక సరిగ్గా అన్యదేవతలవలెనే అల్లాహ్ కూడా చేసిన లీలనా?
·    అల్లా‍హ్ యేసును సజీవంగా కొనిపోయాడా?
·    అలా కొనిపోయినపుడు ఎందుకు ఎవరూ ఆయనను చూడలేదు?
·    ఒకవేళ చూసినా అల్లా‍హ్‍‍యే ఆయనను మరణమునుండి తప్పించి సజీవంగా కొనిపోయాడు అని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? 
·    యేసు తన జీవితంలో కనీసం తన 12 మంది శిష్యులను కూడా ఇస్లాంలో చేర్చలేని అసమర్థుడా?
·    ఒకవేళ యేసు శిష్యులు అందరూ ఇస్లాంను పాటించినవారే అయితే, మరి చరిత్ర దాని పేరు క్రైస్తవ్యం అని ఎందుకు చెబుతోంది?
.    ఒకవేళ యేసు శిష్యులు అందరూ ఇస్లాంను పాటించినవారే అయితే పూర్తిగా ఇస్లాంకు వ్యతిరేకమైన మాటలే వారి రచనలన్నింటిలో ఎందుకు ఉన్నాయి?

ఖురాన్‍ను క్షుణ్ణంగా చదివితే తెలిసోచ్చేది ఏమిటంటే, క్రైస్తవ్యం అల్లాహ్ అనుమతితోనే ఉద్భవించింది, అల్లాహ్ అనుమతితోనే ప్రపంచంలో అతి పెద్ద విశ్వాసముగా అవతరించింది అని. అయితే ముస్లింలు ఏ విధంగా వాదిస్తారో వాటి వెనుక ఉన్న వాస్తవాలేమిటో ఇప్పుడు చూద్దాం.

1 . ఖురాన్ ప్రకారం యేసు ఇస్లాంలో ఒక ప్రవక్త మరియు అల్లాహ్ యొక్క సందేశకుడు. 
సూరహ్ 19లో యేసు పుట్టిన వెంటనే ఇస్లాం యొక్క ప్రచారం చేసినట్టు వ్రాయబడి ఉన్నది. ఆయన తన జీవిత కాలమంతా ఇస్లాం యొక్క సందేశమును ప్రజలకు అందిస్తూ చివరకు అల్లాహ్‍చే కొనిపోబడెను అని ఖురాన్ బోధిస్తుంది. ఇస్లాం ప్రకారము యేసు తనకంటే ముందు వచ్చిన ప్రవక్తల తీరులోనే కేవలం తాను ఒక ప్రవక్తనని, ఇస్లాం సరైన ధర్మమని బోధించెను (ఖురాన్ 42:13). ఈ విధముగా, యేసు 33 సంవత్సరములు ఇస్లాంను ప్రకటించి కొంతమంది యూదులను తన అనుయాయులుగా చేసుకోనెనని ఇస్లాం చెబుతుంది (ఏ సాక్ష్యాలూ లేని ఈ అభూత కల్పనతో క్రైస్తవ్యం ఏకీభవించదు).

2 . ఖురాన్ ప్రకారము యేసు చాలా మందిని శిష్యులనుగా చేసికొనెను.
యేసు తన చిన్నతనం నుండి ఇస్లాంనే ప్రకటించెను కనుక ఆయన ప్రకటనలలో ఇస్లాం యొక్క మూల సిద్ధాంతాలు ఉండి ఉంటాయి. యేసు శిష్యులు కూడా ఇస్లాం యొక్క మూల సిద్ధాంతాలను అనుసరించి ఉంటారు. ఖురాన్ కూడా అదే బోధిస్తుంది. ఖురాన్ 3:52, ఖురాన్ 5:111, ఖురాన్ 57:26. ఖురాన్ చెప్పే ఈ విషయమే కనుక నిజమైతే యేసు కనీసం కొంతమంది యూదులనైనా ఇస్లాం మతంలోనికి సంపాదించుకొని ఉండాలి. కానీ చరిత్ర పుటలనన్నింటినీ భూతద్దంతో కళ్ళుపొడుచుకొంటూ వెతికినా చరిత్రలో మనకు అలాంటి ఆధారాలేవీ మచ్చుకు ఒక్కటంటే ఒక్కటైనా కనబడవు; ఎందుకంటే నశించిపోయేవారు పూర్తిగా నశించిపోవాలని ఇది కూడా సాతాను కల్పించిన అసత్యమే, ఏ సాక్ష్యమూ లేని అభూత కల్పనయే. 

3 . మొదటి శతాబ్దపు యూదులు యేసు శిక్షణ ద్వారా ఇస్లాంను అనుసరించేవారు, కాని వారు ఎక్కువ కాలం నిలువలేకపోయిరి. 
పోనీ సహో. షఫీయొక్క ఉబలాటం తీర్చటానికి యేసు శిష్యులు ఇస్లాం మతమును ఆచరించారు అని కాసేపు ఊహించుకొందాం. ఒకవేళ యేసు శిష్యులు ఇస్లాం మతమును అనుసరించుంటే చరిత్రలో మొత్తంలో కూడా మొదటి శతాబ్దపు ముస్లిములను గురించి ఎక్కడా ఎందుకు కనబడట్లేదు? మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం గురించి ఇశ్రాయేల్ గురించి ఎంతో చరిత్ర అందుబాటులో ఉన్నపుడు ఆ చరిత్రలో ముస్లిముల గురించి ఎందుకు వ్రాయబడలేదు? ఐతే, క్రైస్తవులే ఆ ఆధారాలను చేరిపివేశారు అని ముస్లిములు అనవచ్చు; కాని, అన్యులైన క్రైస్తవేతరుల ద్వారా వ్రాయబడిన చరిత్ర కూడా మనకు అందుబాటులో ఉంది కదా, మరి ఆ చరిత్ర పుస్తకాలలోనైనా ఎందుకు ముస్లిం నమ్మకాలు కలిగిన క్రైస్తవుల గురించి వ్రాయబడలేదు? కనుక మనకు అర్థం అయ్యేది ఏమిటంటే, యేసు సిలువలో చనిపోయాడని, మూడవ రోజున తిరిగి లేచాడని మొదటి శతాబ్దపు క్రైస్తవులు నమ్మేవారంటూ చరిత్రలో వ్రాయబడిన విధంగా అది వాస్తవమే. నూతన నిబంధన గ్రంథములోని నాలుగు సువార్తలను కేవలం చరిత్ర పుస్తకాలుగా చూసినప్పటికీ ఆ పుస్తకాలలో కూడా ఇస్లాంలో బోధించిన నమ్మకానికి భిన్నంగా యేసు సిలువ వేయబడెననే  క్రైస్తవుల నమ్మకమే నమోదు చేయబడి ఉన్నది. అంతేకాక బైబిల్‍కు బయట కూడా ఎన్నో చరిత్ర పుస్తకాలలో ఇదే నమ్మకాన్ని క్రైస్తవుల నమ్మకంగా నమోదు చేసి అభివర్ణించటం మనం చూడవచ్చు. ఉదాహరణకు, యేసు శిష్యుడయిన పేతురు మొదటి శతాబ్దములోని రోముకు చేందిన  క్లెమెంత్‍ను బిషప్‍గా నియమించిన తరువాత అతను వ్రాసిన పుస్తకములో - యేసు సిలువ వేయబడ్డాడనేదే పేతురు యొక్క విశ్వాసము అని వ్రాశాడు (1 Clement 42:3). యూదుల చరిత్రకారుడైన జోసేఫుస్ మరియు రోమీయుల చరిత్రకారుడైన తాసితుస్‍ల ప్రకారం కూడా - మొదటి శతాబ్దపు క్రైస్తవులు, చనిపోయిన యేసును ఆరాధిస్తారు అని వ్రాయబడి ఉంది (Josephus, Antiquities 18.64, and Tacitus, Annals 15.44). చివరికి యూదుల తల్మూద్ గ్రంథాలు కూడా యేసు సిలువ వేయబడ్డాడనే నమోదు చేశాయి. 

పై వివరణ అనంతరం మనకు తెలిసి వచ్చేది ఏమిటంటే -
1 . యేసు సిలువ వేయబడిన సంఘటన జరిగిన 6 శతాబ్దాల తరువాత వచ్చిన ఖురాన్ ఆ సంఘటన గురించి తప్పుగా వర్ణించింది.
2 . యేసు శిష్యులు ముస్లిములు కానేకారు. ఇది కేవలం మొహం చాటేసుకోలేక ముస్లిములు మాత్రమే పుట్టించుకొన్న ఉత్తుత్తి కావింపు మాట.
3 . ఒకవేళ ఖురాన్ చెప్పే కథే నిజమని ముస్లిములు ఊహించినా, యేసు యొక్క 33 ఏళ్ళ పరిచర్య ఎందుకు పనికి రాకుండా పోయిందో వారే చెప్పాలి. ఎందుకంటే కొద్ది కాలానికే ఆయన ఇస్లాం ఆధారితమైన ఉపదేశములు అంతరించిపోయి క్రొత్త ఉపదేశములు వాటి స్థానాన్ని తీసుకొన్నాయి. ఇస్లాంలోని గొప్ప ప్రవక్త అయిన యేసు తన 33 ఏళ్ళ పరిచర్యలో సాధించింది ఇదేనా? పెద్ద బండిసున్నానా?

4 . ఖురాన్ ప్రక్కరము - యేసు సిలువపై చనిపోయాడని అల్లాహ్‍యే ప్రజలను మభ్యపెట్టెను:   
ఖురాన్ బోధ ప్రకారము యేసు కొంతమంది యూదులను ఇస్లాం స్వీకరించేలా చేసెను. యేసు సిలువ పై చనిపోలేదు కాని అతను చనిపోయాడన్న విధముగా అల్లాహ్ అందరినీ మభ్యపెట్టాడు. అయితే ఇక్కడ వచ్చే సమస్య ఏమిటంటే, యేసు చనిపోక ముందే అల్లాహ్ ఆయనను పరలోకమునకు కొనిపోగా యేసు శిష్యులు ఆయన చనిపోయాడని మృతులలో నుండి లేచాడని ఎలా నమ్మగలరు? ఒకవేళ యేసు శిష్యులు నిజంగానే ముస్లిములు అయితే ఈ కథనం అసలు సృష్టించబడకుండానే ఉండేది. కానీ యేసు యొక్క 11 మంది శిష్యులు ఆయన చనిపోయి మూడవ రోజున తిరిగి లేచినట్టుగా విశ్వసించేవారని చరిత్ర ప్రకారము మనకు తెలుస్తోంది. ఇందు మూలంగా యేసు శిష్యులు ముస్లిములు కాదనే చెప్పాలి. లేకపోయుంటే వారికి ఆ ఆలోచన ఎలా వచ్చిందో వివరించగలగాలి. ఖురాన్ ప్రకారము ఆ ఆలోచన అల్లాహ్‍యే మొదలుపెట్టినట్టు మనం చూస్తాం. (ఖురాన్ 4:157-158)
సహో. షఫీ తన ఉపన్యాసంలో "అల్లాహ్ ఖైరుల్ మాకిరీన" అన్న మాటలు కూడా వాడారు. ఆ మాటలకు అసలు అర్థం ఏమంటే - ''అల్లాహ్ వంచకులందరిలోకి మేటి'' (మోసపూరితమైన వంచన చేయువాడు) అని అర్థం. అల్లాహ్ కేవలము యేసు యొక్క ప్రాణాలను కాపాడుట కొరకే ఈ విధముగా ప్రజలను ఎమార్చాడు అని అనుకున్నా, ఆ ఏమార్పు లేక మోసం వలన యేసు శిష్యులు కూడా దాన్నే నమ్ముకుని మోసపోయారు అనే చెప్పాలి. అలా అయితే ఇప్పుడున్న క్రైస్తవుల నమ్మకానికి కారకులు ఎవరూ? ఇస్లాం ప్రకారం అల్లాహ్ యేసు విరోధులను ఏమార్చటానికి చేసిన కుయుక్తి కారణముగా ఒక క్రొత్త విశ్వాసమే ఆవిర్భవించింది. దానికి కారణం అల్లాహ్ కాదా? ఒకవేళ అల్లాహ్ ఉద్దేశ్యం ఆనాటి శిష్యులను ఎమార్చటం కాకపోతే, సర్వజ్ఞుడైన అల్లాహ్‍కు ఇలా జరుగుతుందన్న సంగతి కూడా ముందుగానే తెలియదా? కనుక యే విధంగా చూసినా అల్లాహ్ చేసిన తప్పే కనిపిస్తుంది. ఆయన ఉద్దేశ్యపూర్వకంగా శిష్యులను ఎమార్చడం వలన ఇస్లాం ప్రకారం ఒక తప్పుడు విశ్వాసంగా క్రైస్తవ్యం ఆవిర్భవించిందా? అలా కాదు, అది అల్లాహ్ ఉద్దేశ్యపూర్వకంగా చేసినది కాదు అంటే, అల్లాహ్ సర్వజ్ఞుడే కాదు అని అర్థం. ఇరకాటంలోబడ్డ ముస్లిములు దీనికి కూడా ఎన్నటికీ సమాధానము చెప్పలేరు.

5. యాదృచ్ఛికంగా అల్లాహ్‍చే ఆవిర్భవించిన క్రైస్తవ్యం అల్లాహ్ ద్వారానే వ్యాపించింది. ఖురాన్ ప్రకారం అల్లాహ్ క్రైస్తవ్యం వ్యాపించేలా సహాయం చేశాడు.
అల్లాహ్‍చే తెలిసో తెలియకో యాదృచ్ఛికంగా మొదలైన క్రైస్తవ్యం అంతటితో ఆగక, ఖురాన్ ప్రకారం, అల్లాహ్‍వలనే వ్యాప్తి చెందింది. ఖురాన్‍లోని 61:14 వచనం చాలా ప్రాముఖ్యమైనది. 
ఎందుకనగా యేసును తిరస్కరించిన యూదులకంటే ఆయనను స్వీకరించిన యేసు శిష్యులను అల్లాహ్ తన సహాయముతో అందరికంటే ఉన్నతమైన స్థానములో ఉంచెనని దీని అర్థం. కనుక యూదులకంటే బలవంతులుగా వ్యాపించిన యేసు శిష్యులు ఎవరబ్బా అని చూస్తే, చరిత్రలో యేసు మరణించి తిరిగి లేచాడనే విశ్వాసము కలిగిన క్రైస్తవులు తప్ప ఇంకొకరు కనబడరు. చరిత్రలో చెప్పిన క్రైస్తవులు తప్ప ఇంకెవరైనా ఉన్నారు అని ముస్లిములు అన్నా కాని, వారెవరూ అల్లాహ్ సహాయముతో ఇస్లాంని ప్రకటిస్తూ చరిత్రలో ఉన్నతమైన స్థానం వరకు చేరిన దాఖలాలే లేవు. ఈ విషయంలో కూడా బొక్కబోర్లబడ్డ ఖురాన్‍కు ముందుకు వెళితే గొయ్యి వెనక్కి వెళితే నుయ్యి వంటి స్థితే. ఎందుకంటే, అల్లాహ్ సహాయం చేసిన సమూహం చరిత్రలో ఉన్న క్రైస్తవులు కాదు. అనగా, ఇస్లాంని ప్రకటిస్తూ ఉన్నతమైన స్థానం వరకు చేరిన అలాంటి క్రైస్తవులు చరిత్రలో లేనేలేరు. పోనీ అల్లాహ్ చరిత్రలో చెప్పబడిన క్రైస్తవులకే సహాయం చేశాడు అని అంటే - ఖురాన్ ప్రకారం తప్పుడు మతమైన క్రైస్తవులకు ఆ మత విస్తరణలో అల్లాహ్ సహాయం చేసినవాడవుతాడు. ఈ సమస్యకి కూడా ముస్లిములు ఎన్నటికీ సమాధానము చెప్పలేరు.

ఇంతకంటే  ఎక్కువ చెప్పనవసరం లేకుండా ఇస్లాం యొక్క బోధ తప్పు అని నిరూపించవచ్చు. ఎందుకంటే, పై వివరణ ఆధారంగా అల్లాహ్ కొన్ని కోట్ల మందిని తప్పుడు మతంలోకి నడిచేలా మోసపుచ్చాడు. ఒకవేళ అల్లాహ్ అలా చేసియుండకపోతే యేసును అల్లాహ్‍యే కొనిపోయాడన్న సంగతి అందరూ చూసి వుండుంటే ఇలాంటి సమస్య ఎదురయ్యేదే కాదు. అల్లాహ్ ఎందుకు యేసు యొక్క విరోధులకు ఆయన చనిపోయాడన్న తృప్తి కల్పించటానికి ప్రయత్నం చేశాడు? అసలు ఇస్లాం గనుక సత్యాన్నే బోధిస్తున్నట్లయితే, అల్లాహ్ ఒక మోసపుచ్చే దేవుడు అని ఆధారాలతో సహా నిరూపించబడిపోయినట్లే. ఎందుకంటే, ఇస్లాం చెప్పేదే నిజమైతే, అల్లాహ్ కోట్లమందిని క్రైస్తవ్యంలోకి నడిపించి దానిని అత్యంత ఉన్నతమైన స్థానంలోకి చేర్చినవాడయ్యాడు. అలాగే ఇస్లాం నిజమైతే, యేసు అల్లాహ్ యొక్క ప్రవక్త అయినప్పటికీ అతని రాక ఏ ఒక్కరినీ ఇస్లాంలోకి నడిపించకపోగా ప్రపంచములోనే అతిపెద్ద తప్పుడు మతము స్థాపించేంత ఘోర వైఫల్యమునకు కారణమైందిగదా! కాని యేసు ఒక గొప్ప ప్రవక్త అని ఆయన  జీవించిన 6 శతాబ్దాల తరువాత వచ్చిన ఖురాన్ చెబుతూనే ఉంది. ఇలాంటి పొందిక లేని పరస్పర విరోధమైన కల్పనల వలన ఇస్లాం మతమును, యే విచక్షణ ఉన్నవాడు కూడా సరి అయినది అని చెప్పలేడు, సహో. షఫీలాంటి దావా ప్రచారకులు తప్ప.

చివరి మాటలు 
సహో. షఫీ తన ఉపన్యాసంలో చేసిన వ్యాఖ్యలకు బదులుగా మాత్రమే ఈ చిన్న సంచిక జత చేయడమైనది. క్రైస్తవులమైన మనము మన దగ్గర ఉన్న సత్యాన్ని ధైర్యముతోను మరియు ప్రేమతోను పదిమందికి పంచిపెట్టాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుకే నీ పాపక్షమకొరకై ఎంతో ఓర్పుతో తన కుమారుని ప్రాణం కూడా సమర్పించాడు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పి మనకు ఒక ఉదాహరణగా నిలిచాడు. ఆయన దైవత్వమును అర్థం చేసుకొని ఆయన మందలో చేరిన వారిని యేసు తన అక్కున చేర్చుకొంటాడు. ఈ చిన్ని సంచిక ద్వారా దేవుడు మీతో మాట్లాడును గాక. ఆమేన్.


ప్రభుతేజ (తెలుగు రచయిత)
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు